NIZAMABAD | సైబర్ నేరస్థులు వేధింపులను తాళలేక తాజాగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో నివాసముంటున్న కన్నయ్యగౌడ్(35) హోల్‌సేల్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సెల్‌ఫోన్ ఇటీవల హ్యాక్‌కు గురైంది. బాధితుడి ఫొటోలను మార్ఫింగ్ చేసిన దుండగులు ఆయన ఫోన్‌కు అశ్లీల వీడియోలు పంపించారు. డబ్బులు పంపిస్తేనే వదిలేస్తామని పలుమార్లు బెదిరించారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక భయానికి గురైన కన్నయ్యగౌడ్ తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
బాధితుడు ఇటీవలనే కొత్త ఇల్లు నిర్మించుకోగా.. రెండు రోజుల్లో గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు. కన్నయ్యగౌడ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నిజామాబాద్ నాలుగో ఠాణా ఎస్‌హెచ్‌వో సంజీవ్ తెలిపారు