TELANGANA BJP | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వింత వాతావరణం కనిపిస్తోంది. అందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన కన్నకొడుకే షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజానికి బాబూ మోహన్‌కి తొలుత బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కానీ.. రాజీనామా చేస్తానని బెదిరించి మరీ అతను టికెట్ తెచ్చుకున్నాడు. గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేసిన బాబూ మోహన్.. బీఆర్ఎస్ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.