BHAKARAPETA | భార్యాభర్తల సమస్యలోకి ఓ కానిస్టేబుల్ దూరాడు. దాంతో తన భార్య విషయంలో కానిస్టేబుల్ అన్యాయం చేస్తున్నాడని, దొంగతనం కేసుపెట్టి లోపలేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన చంద్రగిరి ఠాణాలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు 70 శాతం కాలిన గాయాలతో రుయా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
విజయవాడకు చెందిన మణికంఠ, తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గను పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు గాయత్రి(8), అభయ్(5). బతుకుదెరువుకోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూణ్నెళ్ల కిందట భర్తతో విభేదించిన దుర్గ తిరుపతికి వచ్చేశారు. ఇక్కడ భాకరాపేటకు చెందిన సోను అలియాస్ బాషాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చంద్రగిరి కానిస్టేబుల్ పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో ఆయనకున్న మామిడితోటకు కాపలాగా ఉంటూ అక్కడే మకాం పెట్టినట్లు సమాచారం.
ఇటీవల దుర్గ తన భర్తకు ఫోన్‌చేసి నువ్వంటేనే ఇష్టమని భాకరాపేటలో ఉన్నానంటూ ఫోన్ చేసింది. సోమవారం ఉదయం చంద్రగిరి చేరుకున్న మణికంఠ తన భార్యను ఇంటికి పంపించాలంటూ కానిస్టేబుల్ శ్రీనివాసులును కలిశారు. ఇది ఇష్టం లేని కానిస్టేబుల్ ఆమెను ఇక్కడే వదిలివెళ్లిపో.. లేకుంటే దొంగతనం కేసులు పెట్టి లోపలేస్తానంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైన మణికంఠ పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. క్యాన్‌లో పెట్రోల్ నింపుకొని స్టేషన్ వద్ద ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని లోపలకు పరుగులు తీశాడు.
వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. ఆ సమయంలోనూ బాధితుడు కానిస్టేబుల్ తనతో వ్యవహరించిన తీరును ఏకరువు పెట్టారు. ఘటనా సమయంలో చంద్రగిరిలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో పశువైద్య సంచార వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో మణికంఠ మృత్యువుతో పోరాడుతున్నారు. భాకరాపేటలో బాషాతో సహజీవనం చేస్తున్న దుర్గను పోలీసులు రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.